సంక్షేమ బోర్డు ఏర్పాటు
పీఎఫ్–ఈఎస్ఐ, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కల్పించాలని డిమాండ్
కలెక్టర్‌కు వినతిపత్రం
కోల్ బెల్ట్ న్యూస్(గోదావరిఖని):
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
తెలంగాణ ప్రగతిశీల ఆటో అండ్ మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ (ఐఎఫ్‌టీయూ) రాష్ట్ర పిలుపులో భాగంగా బుధవారం జిల్లా మోటార్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏఓ (అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్) ద్వారా జిల్లా కలెక్టర్‌కు ఆటో, మోటార్ కార్మికుల సమస్యలపై వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఐ. కృష్ణ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటాల్లో కీలక పాత్ర పోషించిన మోటార్ కార్మికుల జీవన పరిస్థితుల్లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆశించిన మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సుమారు 35 లక్షల మంది లారీ, క్యాబ్, తుఫాన్, మినీ బస్సు, వ్యాన్, అంబులెన్స్, ఆటో, డీసీఎం, మ్యాజిక్ తదితర వాహనాలను నడుపుతూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ఉన్నత విద్య అభ్యసించినప్పటికీ ఉపాధి అవకాశాలు లేకపోవడంతో అనేక మంది ఈ వృత్తిని ఎంచుకోవాల్సి వచ్చిందన్నారు.
మోటార్ రంగ కార్మికుల సంక్షేమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆటో, మోటార్ కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 2019 రోడ్డు భద్రత చట్టంలోని హిట్ అండ్ రన్ నిబంధనలను ప్రస్తావిస్తూ, ప్రమాదం జరిగిన సందర్భంలో డ్రైవర్లపై కఠిన శిక్షలు, భారీ జరిమానాలు విధించడం అన్యాయమని అన్నారు. ఈ నిబంధనలను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో దేశవ్యాప్తంగా మోటార్ రంగ కార్మికులను ఐక్యం చేసి ఉద్యమాలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మోటార్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఈ. నరేష్, ఉపాధ్యక్షుడు బి. కొమరయ్య, ప్రధాన కార్యదర్శి ఎడ్ల రవికుమార్, జిల్లా నాయకులు ఐ. రాజేశం, తిర్రీ బాలకృష్ణ, పోగుల శేఖర్, ఎనగంటి సతీష్ తదితరులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});