CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 02 August 2026, 5:09 pm Posted By: coalbelt 24 News

కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటమే మార్గం

మంచిర్యాలలో ఏఐటీయూసీ 4వ జిల్లా మహాసభ
కనీస వేతనం రూ.26 వేల అమలు
ప్రైవేటీకరణ నిలిపివేతపై తీర్మానాలు
ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్. విలాస్

కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

భారతదేశంలో సుమారు 54 కోట్ల మంది కార్మికులు ఉన్నప్పటికీ కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కార్మికుల ప్రయోజనాలను విస్మరించిందని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్. విలాస్ ఆరోపించారు. శతాబ్దకాల పోరాటాలు, త్యాగాల ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాలను పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా మార్చి నాలుగు కార్మిక కోడ్‌లను తీసుకువచ్చిందన్నారు. మంచిర్యాలలో నిర్వహించిన ఏఐటీయూసీ 4వ జిల్లా మహాసభలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ఈ మహాసభలను విజయవంతం చేసిన సింగరేణి, అంగన్‌వాడీ, సివిల్ సప్లై, ఇతర రంగాల కార్మికులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు కార్మిక కోడ్‌లను బీజేపీ పాలిత రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని, అయితే ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న అనేక రాష్ట్రాలు వాటిని అమలు చేయలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ కార్మిక కోడ్‌లను అమలు చేయబోమని స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగించిన ఉద్యమం ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాలను వెనక్కి తీసుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ, అలాగే నీట్ పరీక్ష అంశంపై జరిగిన ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చిందన్నారు. ఇదే తరహాలో కార్మిక వర్గం కూడా నాలుగు కార్మిక కోడ్‌ల రద్దు కోసం దేశవ్యాప్తంగా తీవ్ర ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం అంగన్‌వాడీ ఉద్యోగులకు రూ.18 వేల వేతనం, మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.10 వేల వేతనం ఇస్తామని ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, అన్ని వర్గాల కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు.

ఈ జిల్లా మహాసభలో కార్మికుల సమస్యలపై పలు కీలక తీర్మానాలు ఆమోదించినట్లు తెలిపారు. ఆగస్టు 6, 7, 8 తేదీల్లో కరీంనగర్‌లో జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల్లో రాష్ట్రవ్యాప్త పోరాట కార్యాచరణను రూపొందిస్తామని, డిసెంబర్‌లో బెంగళూరులో జరిగే జాతీయ మహాసభల్లో దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలను ఐక్యం చేసి నాలుగు కార్మిక కోడ్‌ల రద్దు, కనీస వేతనం రూ.26 వేల అమలు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేత, బ్యాంకింగ్ రంగంలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమాలకు కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, కలవేన శంకర్, రామడుగు లక్ష్మణ్, ఎం. వెంకటస్వామి, మేకల దాసు, అక్బర్ అలీ, కలిందర్ అలీ ఖాన్, ఎం. పౌలు, ఎం. సమ్మయ్య, సరస్వతి, దాగం మల్లేష్, ఎస్.కే. బాజీ సైదా, సలేంద్ర సత్యనారాయణ, జోగుల మల్లయ్య, ఇప్పకాయల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

 




(adsbygoogle = window.adsbygoogle || []).push({});