సమయపాలన పాటించాలని ప్రజాప్రతినిధుల సూచన
బీబీపెట్ గ్రామపంచాయతీలో ‘జలసిరి’ కార్యక్రమం
కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
కామారెడ్డి జిల్లా బీబీపెట్ గ్రామపంచాయతీలో గురువారం “జలసిరి” కార్యక్రమంలో భాగంగా గ్రామసభ నిర్వహించారు. అయితే గ్రామసభ ప్రారంభ సమయానికి సంబంధిత అధికారులు హాజరుకాకపోవడంతో ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు కొంతసేపు వేచి చూడాల్సి వచ్చింది. అధికారులు ఆలస్యంగా చేరుకోవడంతో గ్రామసభ కూడా ఆలస్యంగా ప్రారంభమైంది. అధికారులు సమయానికి హాజరుకాకపోవడంపై గ్రామ ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామసభల వంటి ప్రజలకు అత్యంత ముఖ్యమైన సమావేశాలకు అధికారులు సమయపాలన పాటించాలని వారు సూచించారు.
అనంతరం ప్రారంభమైన గ్రామసభలో గ్రామ అభివృద్ధి, తాగునీటి సమస్యలు, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. గ్రామ ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, అధికారులు వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ స్వాద్విక మాట్లాడుతూ, గ్రామసభలు ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైనవని, భవిష్యత్తులో అన్ని శాఖల అధికారులు సమయపాలన పాటిస్తూ గ్రామసభలకు హాజరై ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. అలాగే గ్రామసభకు హాజరైన అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ సంధర్బంగా సంబంధిత శాఖల అధికారులు మాట్లాడుతూ వర్షాల కారణంగానే సమావేశానికి ఆలస్యమైనదని వివరించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ రమేష్, ఉపసర్పంచ్ ప్రశాంత్, వార్డు సభ్యులు మొహమ్మద్ ఆసిఫ్, రవి, శ్రీకాంత్, దేవరాజు, మహేష్ తదితరులు పాల్గొన్నారు. గ్రామస్థులు కూడా పెద్ద సంఖ్యలో హాజరై గ్రామాభివృద్ధికి సంబంధించిన పలు సూచనలు, అభిప్రాయాలు వెల్లడించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});