రైన్‌కోట్లు, భద్రతా పరికరాలు వెంటనే అందించాలి
కాంట్రాక్టు కార్మికుల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనే
SCKIS-CTU బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి దూలం శ్రీనివాస్
కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి):
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల భద్రత, ఆరోగ్య పరిరక్షణ విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల ఐక్య సంఘం (SCKIS-CTU) బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి దూలం శ్రీనివాస్ ఆరోపించారు. సంస్థలో సుమారు 30 వేల మంది కాంట్రాక్టు కార్మికులు వివిధ విభాగాల్లో సేవలందిస్తున్నప్పటికీ, వారికి అవసరమైన భద్రతా పరికరాలు, ముఖ్యంగా వర్షాకాలంలో రైన్‌కోట్లు అందించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.
కాంట్రాక్టు కార్మికుల శ్రమతోనే సంస్థకు లాభాలు వస్తున్నప్పటికీ, వారి ఆరోగ్యం, ప్రాణాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయన అన్నారు. సేఫ్టీ వారోత్సవాల పేరుతో ప్రచారం చేసే సింగరేణి యాజమాన్యం, ఆచరణలో మాత్రం కాంట్రాక్టు కార్మికులకు కనీస భద్రతా సామగ్రి కూడా అందించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.
సివిల్, సివిక్, ప్రైవేట్ సెక్యూరిటీ, రోడ్డు క్లీనింగ్, బెల్ట్ క్లీనింగ్ తదితర విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులు వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి కాంట్రాక్టు కార్మికుడికి నాణ్యమైన రైన్‌కోట్లు, అవసరమైన భద్రతా పరికరాలు అందించడం సింగరేణి యాజమాన్యం బాధ్యత అని స్పష్టం చేశారు.
కాంట్రాక్టు కార్మికులకు రాజ్యాంగం కల్పించిన కార్మిక హక్కులు అమలు చేయడంలో యాజమాన్యం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని దూలం శ్రీనివాస్ అన్నారు. కార్మికుల పట్ల వివక్షను విడనాడి, శాశ్వత ఉద్యోగులతో సమానంగా భద్రతా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
“కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే సంస్థ ఆరోగ్యంగా ముందుకు సాగుతుంది” అనే విషయాన్ని యాజమాన్యం గుర్తించాలని, “ఒకే కుటుంబం – ఒకే గమ్యం – ఒకే లక్ష్యం” అనే నినాదాలు కేవలం మాటల్లో కాకుండా ఆచరణలో కూడా కనిపించేలా కాంట్రాక్టు కార్మికులకు తగిన రక్షణ, గౌరవం కల్పించాలని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల ఐక్య సంఘం (SCKIS-CTU) డిమాండ్ చేసింది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});