మందమర్రిలో సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ & ప్లానింగ్) విస్తృత పర్యటన
అధికారులకు సూచనలు, సలహాలు
రక్షణతో కూడిన ఉత్పత్తికి ప్రాధాన్యం
సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ & ప్లానింగ్) వెంకటేశ్వర్లు
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
సింగరేణి సంస్థ త్రైమాసిక ఉత్పత్తి లక్ష్యాలను తప్పకుండా చేరుకోవాలంటే బొగ్గు ఉత్పత్తి వేగాన్ని పెంచడంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ & ప్లానింగ్) వెంకటేశ్వర్లు అధికారులకు సూచించారు. మందమర్రి ఏరియాలో ఆయన విస్తృతంగా పర్యటించి వివిధ ఓపెన్‌కాస్ట్, భూగర్భ బొగ్గు గనులను పరిశీలించారు. ఈ సందర్భంగా బొగ్గు ఉత్పత్తి, నాణ్యత, రవాణా, భద్రతా చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
రామకృష్ణాపూర్ ఓసీపీ ఫేజ్–2ను సందర్శించిన వెంకటేశ్వర్లు, గని పరిసర ప్రాంతాల్లో చేపడుతున్న అటవీ పునరుద్ధరణ, ఫారెస్ట్ క్లియరెన్స్ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం కేకే ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్ట్‌లో బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదక గణాంకాలను సమీక్షించి, త్రైమాసిక లక్ష్యాల సాధనకు ఉత్పత్తి వేగాన్ని పెంచాలని, ఇందుకోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించాలని అధికారులను ఆదేశించారు.
శాంతిఖని గనితో పాటు కాశిపేట–1, కాశిపేట–2 భూగర్భ గనుల మైనింగ్ ప్రణాళికలను అధికారులతో కలిసి సమీక్షించిన ఆయన, గనుల్లో భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూనే ఉత్పత్తి పెంపు దిశగా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. భూగర్భ గనుల్లో ఉపయోగించే స్టోవింగ్, బంకర్ల పనితీరు, నిర్వహణపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కేకే ఓసీపీ రైల్వే సైడింగ్‌ను సందర్శించి, వినియోగదారులకు బొగ్గు రవాణా మరింత వేగవంతంగా జరిగేలా సైడింగ్ పనుల పురోగతిని పరిశీలించారు.
ఈ పర్యటనలో మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ, ఎస్‌వో టు జీఎం జి.ఎల్. ప్రసాద్, ఏజీఎం (ఈ అండ్ ఎం) బాలాజీ భగవతిజా, డీజీఎం (సర్వే) భూక్య దేశాయ్, డీజీఎం (సివిల్) భాష, కేకే ఓసీ మేనేజర్ కే. రామరాజు, క్వాలిటీ అధికారి ప్రదీప్, కేకే ఓసీ వెంకట వంశీధర్, ఎస్‌ఎస్‌వో (ఎస్ & పీసీ) వెంకటేశ్వరరెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});