అమృత్ భారత్ పథకంతో మహా రూపాంతరం
రూ.714.73 కోట్లతో ప్రపంచ స్థాయి మౌలిక వసతులు
2027 ఏప్రిల్ నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి స్టేషన్
కోల్ బెల్ట్ న్యూస్(సికింద్రాబాద్):
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
దేశంలోనే అత్యాధునిక రైల్వే స్టేషన్లలో ఒకటిగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపుదిద్దుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ.714.73 కోట్ల అంచనా వ్యయంతో జరుగుతున్న పునరాభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. విమానాశ్రయాలను తలపించేలా అత్యాధునిక సౌకర్యాలు, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో స్టేషన్‌ను తీర్చిదిద్దుతున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు 2022 సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను గిరిధర్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చేపట్టింది. ప్రస్తుతం సుమారు 70 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను 2027 ఏప్రిల్ నాటికి పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువస్తామని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌ఓ శ్రీధర్ తెలిపారు.
ప్రతిరోజూ 200కు పైగా రైళ్లు, రెండు లక్షలకు పైగా ప్రయాణికులకు సేవలు అందిస్తున్న సికింద్రాబాద్ స్టేషన్‌ను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విస్తరిస్తున్నారు. జీ+3 నమూనాలో ఐకానిక్ టెర్మినల్ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఉత్తర, దక్షిణ వైపులా అత్యాధునిక టెర్మినల్ భవనాలు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం స్టేషన్ విస్తీర్ణాన్ని సుమారు 22,516.16 చదరపు మీటర్లకు పెంచుతుండగా, దక్షిణ వైపు భవనం మాత్రమే మూడు అంతస్తుల్లో 14,792 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మితమవుతోంది.
ప్రయాణికుల సౌకర్యాల కోసం స్టేషన్‌లో 26 లిఫ్ట్‌లు, 32 ఎస్కలేటర్లు, రెండు ట్రావెలేటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్లాట్‌ఫాంలన్నింటినీ అనుసంధానించే రెండు అంతస్తుల విశాలమైన ఎయిర్ కాంకోర్స్ నిర్మిస్తున్నారు. ఇందులో ఆధునిక వెయిటింగ్ హాళ్లు, ఫుడ్ కోర్టులు, కెఫెటేరియాలు, రిటైల్ షాపులు, రూఫ్ ప్లాజా వంటి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. అన్ని ప్లాట్‌ఫాంలు, ట్రాక్‌లపై పూర్తి స్థాయి రూఫ్ కవరింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. సికింద్రాబాద్ ఈస్ట్, వెస్ట్ మెట్రో స్టేషన్లను రైల్వే ప్లాట్‌ఫాంలతో నేరుగా అనుసంధానించే ప్రత్యేక స్కైవాక్‌లను నిర్మిస్తున్నారు. దీంతో మెట్రో-రైల్వే ప్రయాణం మరింత సులభతరం కానుంది.
పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ స్టేషన్‌లో సోలార్ పవర్ ప్లాంట్, ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. భద్రత కోసం హై-రిజల్యూషన్ సీసీటీవీ కెమెరాలతో కూడిన ఆధునిక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వ్యర్థాల నిర్వహణ కోసం మురుగు నీటి శుద్ధి ప్లాంట్ (ఎస్‌టీపీ) నిర్మాణం కూడా కొనసాగుతోంది. వాహనాల రద్దీని తగ్గించే లక్ష్యంతో బేస్‌మెంట్‌తో పాటు బహుళ అంతస్తుల పార్కింగ్ సముదాయాన్ని నిర్మిస్తున్నారు. బేస్‌మెంట్, మొదటి అంతస్తుతో పాటు మరో నాలుగు అంతస్తుల్లో పార్కింగ్ సౌకర్యం కల్పించనున్నారు. దీంతో ప్రయాణికులకు పార్కింగ్ సమస్య లేకుండా చూడనున్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పూర్తయిన తర్వాత ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో పాటు తెలంగాణలోనే అత్యాధునిక రైల్వే హబ్‌గా సికింద్రాబాద్ కొత్త గుర్తింపు పొందనుంది. ప్రస్తుతం ప్లాట్‌ఫాం నంబర్-10లో 90 శాతం పనులు పూర్తయ్యాయి. అక్కడ అండర్‌గ్రౌండ్ పార్కింగ్ నిర్మాణం కూడా పూర్తయిందని అధికారులు తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దశలవారీగా నిర్మాణ పనులు చేపడుతున్నామని, ఒకవైపు పనులు పూర్తి చేసిన తర్వాత మరోవైపు పనులు నిర్వహిస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌ఓ శ్రీధర్ వెల్లడించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});