CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 27 July 2026, 11:27 am Posted by : coalbelt 24 News

జూలై 28,29న మిర్యాలగూడలో ఎంసీపీఐ(యు) రాష్ట్ర కమిటీ సమావేశాలు

పోరాటాల ఫలితంగానే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
ఎంసీపీఐ(యు) జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్ర ప్రసాద్

కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

జూలై 28, 29 తేదీలలో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరగనున్న ఎంసీపీఐ(యు) తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాలను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని పార్టీ జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్ర ప్రసాద్, జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ మాట్లాడుతూ, రాష్ట్ర కమిటీ సమావేశాలకు తెలంగాణలోని 25 జిల్లాల నుంచి సుమారు 70 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు హాజరవుతారని తెలిపారు.

ఈ సమావేశాల్లో దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన విద్యార్థి, యువజన ఉద్యమాలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన పరిణామం, అలాగే పలు రాజకీయ, సామాజిక అంశాలపై సమగ్రంగా చర్చించనున్నట్లు తెలిపారు. కేవలం కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాతో సమస్య పరిష్కారం కాదని, కేంద్ర విద్యా విధానంపై సమగ్ర సమీక్ష చేపట్టడంతో పాటు నీట్ విధానాన్ని పునఃసమీక్ష చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజీ ఘటనల నేపథ్యంలో ప్రాణాలు కోల్పోయిన 21 మంది విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కోరారు.

అదేవిధంగా, జంతర్ మంతర్‌లో జరిగిన ఆందోళనతో పాటు దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాల సందర్భంగా నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బ్రిటిష్ కాలం నాటి నిర్బంధ చట్టాలను రద్దు చేసి ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో విద్యార్థులు, యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యలపై రాష్ట్ర కమిటీ సమావేశాల్లో చర్చించి ప్రజా ఉద్యమాలకు కార్యాచరణ రూపొందించడంతో పాటు విస్తృత ఐక్య ఉద్యమాల నిర్మాణానికి నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఐ(యు) బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి ఆరెపల్లి రమేష్, తోగరి రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});